ఏపీ టీచర్ల బదిలీలో కొత్త రచ్చ

-

కోరిన చోటుకు బదిలీ కావాలి. ఆ బదిలీ ఉత్తర్వులు తాము చెప్పినట్టే ఉండాలి. తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ఆర్డర్స్‌ ఇవ్వాలి. ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు ఇలాగే ఉందట. సుదీర్ఘ ఆందోళనల తర్వాత బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. వారిలో సన్నాయి రాగాలు ఆగలేదు. అసంతృప్తి వీడలేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక..తొలిసారిగా టీచర్ల బదిలీలను భారీ ఎత్తున చేపట్టింది. ఈ బదిలీల కోసమే అప్పటి వరకు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి ఉపాధ్యాయ సంఘాలు. చాలా స్కూళ్లల్లో పోస్టులను బ్లాక్‌ చేశారని అవినీతికి పాల్పడుతున్నారని ఉద్యమించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం వారికి నచ్చజెప్పింది. ఆ తర్వాతే బదిలీల ప్రక్రియను ప్రారంభించింది సర్కార్‌. అంతా ఆన్‌లైన్‌ పద్దతిలోనే కాబట్టి.. ఆన్‌లైన్‌లోనే బదిలీ ఉత్తర్వులు తీసుకుంటున్నారు టీచర్లు. ప్రస్తుతం పని చేస్తున్న స్కూళ్ల నుంచి రిలీవ్‌ లెటర్లు తీసుకుని.. బదిలీ అయిన స్కూళ్లల్లో జాయినింగ్‌ లెటర్లు ఇస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బదిలీలు చేస్తున్నారు.. ఉత్తర్వులు ఇస్తున్నారు సరే.. ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి..అన్నది కొందరు ఉపాధ్యాయుల ప్రశ్న. ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా అంతా పండగ హడావుడిలో ఉంటే ఈ సమయంలో బదిలీ ఉత్తర్వులు ఇస్తే ఎలా గతంలో కూడా బదిలీలు జరిగినా.. ఈ తరహాలో ఎప్పుడూ చేయలేదు. ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఉత్తర్వులను ఇస్తున్నారని తెగ ఫీలైపోతున్నారట కొందరు ఉపాధ్యాయులు.

ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్న ఈ అంశాలతో ప్రభుత్వ వర్గాలు.. ప్రత్యేకించి కొందరు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతున్నారట. బదిలీ ఉత్తర్వులు ఎప్పుడివ్వాలి..ఎలా ఇవ్వాలో కూడా అధికారులకు టీచర్లే పాఠాలు చెబుతారా అని మండిపడుతున్నారట సదరు అధికారులు. సెలవుల్లో ఈ సమయంలోనే బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ రిలీవ్‌.. జాయినింగ్‌ వంటివి పూర్తయితే స్కూళ్లు రీఓపెన్ నాటికి ఎలాంటి జాప్యం ఉండదన్నది అధికారుల వాదన. దీనిని తప్పుపట్టడాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు.

టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తోన్నా..ఇంకా సన్నాయి నొక్కులు నొక్కడంపై కొందరు అధికారులు సీరియస్‌గానే ఉన్నారట. అసలే కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బంది పడుతుంటే.. వీలైనంత వరకు సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి షరతులు పెట్టడం విమర్శలు చేయడం మీద మండిపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news