కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. చిన్నస్థాయి నేతల నుంచి మంత్రుల వరకు.. అందరూ నాన్‌స్టాప్‌గా ఊదరగొడుతుండటంతో ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ముహూర్తం ఖరారైందని.. త్వరలోనే పట్టాభిషేకం ఉంటుందని అధికారపార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ రేంజ్ స్పీడుతో నేతల కామెంట్స్ చూస్తుంటే వీరి పలుకుల వెనుక ఆంతర్యం వేరే ఉందని చర్చించుకుంటున్నారట పార్టీలో తలపండిన నేతలు…
కేటీఆర్ సీఎం ప్రచారం ఊరకే ఏం రాలేదు. అధికార పార్టీకి చెందిన నేతలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఏకధాటిగా ఒకరితర్వాత ఒకరు చేస్తున్న ప్రకటనలతో ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. వెంటనే కేసీఆర్.. కేటీఆర్‌ను సీఎంను చేసేదిశగా ఆలోచన చేయాలని కొందరు కోరితే… తగు సమయంలో నిర్ణయం ఉంటుందని మరికొందరంటున్నారు. సీఎం పీఠంపై కూర్చొనేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు బోధన్ ఎమ్మెల్యే షకీల్, మరో సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్. ఇలా చెప్పేవారి జాబితాలోకి ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న మంత్రులు కూడా వచ్చేశారు.
ఏకంగా కాబోయే సీఎం రామ్‌కు కంగ్రాట్స్ అంటూ సంచలనం రేపారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. దీంతో ఈ టాపిక్ మరింత హాట్‌హాట్‌గా మారిపోయింది.ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే రసమయి చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణ వచ్చాక పాటలు మారిపోయాయన్నారు రసమయి. కలాలు.. గళాలు మౌనంగా ఉంటే కేన్సర్ కంటే ప్రమాదమని కామెంట్ చేశారాయన. రసమయి ఈ సమయంలో ఎందుకిలా మాట్లాడారన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ సీఎం అయ్యే పరిస్థితి ఉంటే ప్రస్తుతం ఉన్న కేబినెట్ రద్దు అవుతుంది. సొంతంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేబినెట్‌లో ఉన్నవారు తమ సీటును పదిలం చేసుకునేందుకు కేటీఆర్‌ను పోగడ్తల్లో ముంచెత్తుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పెద్దలు వద్దని వారిస్తున్నా..నేతలు రామభజన చేయడం మాత్రం ఆపడం లేదు. యువనేత దగ్గర మార్కులు కొట్టేసేందుకు సమయం దొరకడమే ఆలస్యం..ఇలా చిడతలు కొడుతూనే ఉన్నారు. కేటీఆర్ దృష్టిలో పడేందుకు పోటీపడుతున్నారు. ఇకపై ఈ విషయం మీద మాట్లాడొద్దని కేటీఆర్ అన్ అఫీషియల్‌గా అందరికీ చెప్పాడు. అయినా నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కేటీఆర్ విషయంలో సీఎం కేసీఆర్ వ్యూహం ఏమిటనేది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. తాను ఇంకో పదేళ్లు సీఎంగా ఉంటానని చెప్పినా.. ఏదో ఒక వ్యూహం లేకపోతే ఇలాంటి ప్రచారం ఎందుకు తెరమీదకు వస్తుందనే అభిప్రాయమూ రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.