గ్రామ/ వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్పై విచారణను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది.
వాలంటీర్లకు నెలవారీగా ఇచ్చే రూ.5 వేల గౌరవవేతనంతోపాటు, విస్తృత సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రిక కొనుగోలు కోసం నెలకు రూ.200 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం 2022 జూన్లో జీవో విడుదల చేసింది. 1.45 లక్షల మంది గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులకు రూ.200 చొప్పున మంజూరు చేస్తూ 2022 డిసెంబర్లో మరో జీవో ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గత ఫిబ్రవరిలో పిటిషన్ వేసింది.
ఆ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.