వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించారు.
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చన్న అంశాలపై గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందని అన్నారు.వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగ పడుతుందని.. ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలని సూచించారు.