అమరావతి : బొగ్గు ఉత్పత్తిలో ఎపిఎండిసి {ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ } కీలక ముందడుగు వేసింది. సుల్యారీ బొగ్గు గని నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. దీంతో సింగరేణి, కోల్ ఇండియా సరసన చేరింది ఎపిఎండిసి. వాటి తరహాలోనే జాతీయ స్థాయిలో వాణిజ్య బొగ్గు ఉత్పత్తి చేసే ఘనత సాధించింది ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్.
ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాల్లో తొలి విజయం సాధించింది. 2007 లోనే సుల్యారీ బొగ్గుగని కేటాయింపులు జరుగగా… 2019 వరకు బొగ్గు ఉత్పత్తిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుల్యారీ కోల్ మైన్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్… అటు కేంద్రంతోనూ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వంతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపారు.
బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఈ ఘనత సాధ్యమైంది. సీఎం జగన్ చొరవ వల్లే సుల్యారీ బొగ్గుగనిలో ఉత్పత్తి సాధ్యమైందని.. ఎపిఎండిసికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. 2021లో ప్రైవేటు సంస్థలతో పోటీపడి బ్రహ్మదియా కోల్ బ్లాక్ ను ఎపిఎండిసి దక్కించుకుందని వెల్లడించారు. దీంతో ఏపీలో కరెంట్ కోతలకు చెక్ పెట్టవచ్చన్నారు.