కాశ్మీర్‌లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం మార్తాండ సూర్య దేవాలయం. సూర్య భగవానునికి అంకితమివ్వబడిన ఈ మార్తాండ దేవాలయాన్ని క్రీ.శ. 8 వ శతాబ్దిలో కాశ్మీర రాజు ‘లలితాదిత్య ముక్తాపీడుడు’ నిర్మించాడు. కాశ్మీరీ వాస్తు కళకు మచ్చుతునకగా వున్న ఈ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి, అపురూప అలంకారాలకు ప్రసిద్ధి పొందింది. ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉంది.
కాశ్మీరును పరిపాలించిన కర్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడు అయిన లలితాదిత్య ముక్తాపీడుడు క్రీ.శ. 8 వ శతాబ్దంలో ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. క్రీ.శ. 725-756 సంవత్సరాల మధ్యకాలంలో ఆ ఆలయం నిర్మాణం పూర్తి అయివుండవచ్చు.కల్హణుడు తన గ్రంథం ‘రాజ తరంగిణి’లో ఈ ఆలయాన్ని లలితాదిత్య ముక్తాపీడుడు నిర్మించాడనే తెలిపాడు.
అప్పట్లో ఈ ప్రాంతాలను పరిపాలించిన రాజు లెందరో ఈ సూర్య దేవాలయానికి బంగారం, వెండి, వజ్రాలు, కెంపులు, రత్నాలు ఇలా ఎన్నో కానుకలు ఇచ్చారు. వేలాది ఎకరాలను మాన్యంగా అందజేశారు. మార్తాండ సూర్య దేవాలయం, జమ్మూ కాశ్మీర్ దీంతో దేవాలయంలోని ఖజానా ఈ కానుకలతో ఎప్పుడూ నిండుగా కనిపించేది.
ఆ కాలంలో ఆలయం ఎంతో శోభాయమానంగా విరాజిల్లింది. ఆ విధంగా ఎంతో ప్రశస్తి చెందిన ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు కూలగొట్టారు. భారతదేశం ముస్లిం రాజుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత మార్తాండ సూర్య దేవాలయం పై వారి కన్ను పడింది. షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ (సికిందర్ బుత్షికాన్) ఆదేశాల మేరకు క్రీ.శ. 15 వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసారు.
సికిందర్ తన సైనికుల చేత ధ్వంసం చేయించాడు. దాదాపుగా 13 నెలల పాటు సైనికులంతా కలిసి ఎంతో కష్టపడితే, డెబ్బై శాతం ఆలయాన్ని మాత్రమే కూలగొట్టగలిగారు. అంటే ఆ ఆలయాన్ని ఎంత పటిష్టంగా నిర్మించారో మనకు అర్థమవుతోంది. చివరికి ఎలాగైనా ఆలయాన్ని పూర్తి నాశనం చేయాలని , మిగిలిన భాగానికి భారీగా నిప్పు పెట్టారు. ఆలయాన్ని ధ్వంసం చేసే క్రమంలో అక్కడి సైనికులకు భూగర్భంలో ఒక రాగి ఫలకం దొరికింది.
ఆ రాగి ఫలకం లో ఈ ఆలయ జీవిత కాలం రాజు తెలుసుకోగోరి , ఆస్థాన జ్యోతిష్కులను అడుగగా వారు ఈ ఆలయం నిర్మించిన 1100 సంవత్సరాల తర్వాత సికిందర్ అనే పేరు గల రాజు చేతిలో ఇది ధ్వంసం అవుతుంది అని రాసి ఉంది. దీనిని చదివించుకున్న సికిందర్ ఈ ఆలయం ధ్వంసం విషయాన్ని అంత కచ్చితంగా చెప్పిన అప్పటి జ్యోతిష్యుల పరిజ్ఞానానికి , నైపుణ్యానికి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.