ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే భారత్‌లోనూ జనవరి 16వ తేదీ నుంచి కరోనా టీకాలను పంపిణీ చేస్తున్నారు. మార్చి చివరి వరకు మొదటి దశ టీకాల పంపిణీ పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ మద్దతుగా నిలిచింది.
సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఫోన్లతోపాటు ఐప్యాడ్లు, ఇతర డివైస్‌లలో రన్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే సదరు ఓఎస్‌కు గాను 14.5 వెర్షన్‌ను యాపిల్ త్వరలో విడుదల చేయనుంది. కానీ ఆ వెర్షన్‌కు చెందిన బీటా ఎడిషన్‌ను యాపిల్ తాజాగా లాంచ్ చేసింది. అందులో కరోనా వ్యాక్సినేషన్‌కు మద్దతుగా యాపిల్ సిరంజ్ ఎమోజీని మార్చేసింది.
ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిరంజ్ ఎమోజీ రక్తంతో నిండి ఉండడమే కాక అందులో నుంచి రక్తం చుక్కలు బయటకు వస్తుంటాయి. ఈ ఎమోజీ ప్రస్తుతం యాపిల్ డివైస్‌లలో అందుబాటులో ఉంది. కానీ ఐఓఎస్ 14.5 వెర్షన్ వస్తే అందులో రక్తం సిరంజ్‌కు బదులుగా సాధారణ సిరంజ్ యూజర్లకు కనిపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్‌కు మద్దతుగానే యాపిల్ ఈ ఎమోజీని మార్చింది. ఐఓఎస్ 14.5 వెర్షన్ అప్‌డేట్ అయితే రక్తంలో కూడిన ఆ సిరంజ్ ఎమోజీ కాకుండా సాధారణంగా ఉన్న సిరంజ్ ఎమోజీ కనిపించనుంది. కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.