చిత్తూరులో జరిగే బిజెపి యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీ నివా, గాలేరు నగరి, లాంటి రాయలసీమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదంటూ మండిపడ్డారు. రాయలసీమ ఎమ్మెల్యేలు, మంత్రులకు సిగ్గులేదా? మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు నిలదీయడం లేదా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మీరు అడగరా? అంటూ మండిపడ్డారు.
నేను ఉన్నాను.. నేను విన్నాను అని నమ్మబలికి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం మైనింగ్, ల్యాండ్, సాండ్, లిక్కర్లపై ఆధారపడి అవినీతికి గేట్లు తెరిచిందన్నారు. మద్యం బ్రాండ్లపై, డిస్టలారీ పై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ప్రజల ఆదాయ మార్గాలు పెరగలేదు కానీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇన్కమ్ టాక్స్ మాత్రం పెరిగిందన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బిజెపి పోరాడుతుందని స్పష్టం చేశారు.