రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. హెల్త్ రిపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత విస్మరించారని.. జైళ్ల శాఖ డీజీఐ ఒక డాక్టర్‌లా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా జైళ్ల శాఖ డీజీఐ మాట్లాడారన్నారు. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు ఒక్కరినే ప్రత్యేకంగా చూడలేమంటూ జైలు అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మరో మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు… అలాంటి వ్యక్తికి కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? జైలును అత్తగారి ఇల్లులా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్న విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలి. చంచల్ గూడ జైలును వైసీపీ కార్యాలయంగా మార్చి, అక్కడే పార్టీలో చేరికలు, పార్టీ సమావేశాలు నిర్వహించారు. షటిల్ ఆడుతూ చంచల్ గూడ జైలులో జగన్ కాలక్షేపం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయినా, ప్రజలు మరచిపోలేదు. 74 సంవత్సరాల చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదు, బాడీ చెకప్ చేయాలి. జైళ్ల అధికారులు డాక్టర్లు చెప్పింది యథాతథంగా చెప్పటంలేదు, వివరాలు దాస్తున్నారు. హెల్త్ బులిటెన్ విడుదల చేయటంలేదు. చంద్రబాబు బరువు నెల క్రితం ఎంత ఉంది, ఇప్పుడెంత ఉంది అనేది డాక్టర్లు చెప్పాలి అని అన్నారు.