మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, వైసీపీ ప్రభుత్వంల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. వంశపారంపర్యంగా వస్తున్న నిబంధనలు ప్రకారం, కుటుంబ పెద్దగా ఉన్న అశోక్ గత కొన్నేళ్లుగా మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అశోక్‌కు చెక్ పెడుతూ, సంచయితని ఛైర్మన్‌గా పెట్టారు. ఇక సంచయిత బ్యాగ్రౌండ్ ఏంటో అందరికీ తెలిసిందే.
ఆమె అంతర్గత వ్యవహారం పక్కనబెడితే, వంశపారంపర్యంగా కుటుంబ పెద్దగా తాను ఉండగా, సంచయితని ఛైర్మన్‌గా పెట్టడం చెల్లదని అశోక్ కోర్టుకెళ్లారు. ఏడాది తర్వాత కోర్టులో అశోక్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళీ ఛైర్మన్‌గా అశోక్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అశోక్‌ని వైసీపీ వదలడం లేదు. దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తామని, అశోక్ ఒక పెద్ద దొంగ అని, గతంలో మాన్సాస్‌లో అక్రమాలు జరిగాయని, టీడీపీ హయాంలో 115 ఎకరాలు చట్టవిరుద్ధంగా అమ్మేశారని, 2010లో 500 ఎకరాలు కాజేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే మాన్సాస్ ట్రస్టు ఆడిటింగ్ పదేళ్లుగా జరగడం లేదని అంటున్నారు.
అయితే మాన్సాస్ ట్రస్ట్ కింద ఉన్న ఆస్తులు గజపతి ఫ్యామిలీ దానం చేసినవే అని, ఇంకా తమ హయాంలో 36 ఎకరాలు చట్టబద్దంగా వేలం వేశామని టీడీపీ చెబుతోంది. అలాగే ఎవరు ఛైర్మన్‌గా ఉండగా అక్రమాలు జరిగాయో తేల్చాలని, సంచయిత ఛైర్మన్‌గా ఉన్న ఈ ఏడాది సమయంలోనే ఆడిటింగ్ జరగలేదని అశోక్ చెబుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి మాటల యుద్ధం జరుగుతుంది.
కానీ అసలు నిజాలు ఏంటో ఎవరికి తెలియడం లేదు. కాకపోతే అశోక్‌కు చెక్ పెట్టాలనే లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతుందనే వాదన ఎక్కువగా వస్తుందని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని, దానం చేసింది ఆయన కుటుంబమే అయినప్పుడు అక్రమాలు ఎలా జరుగుతాయని విజయనగరం జిల్లాలో కొన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అశోక్ వ్యక్తిత్వం గురించి తెలిసినవారు ఎవరు ఆయనపై విమర్శలు చేయరని, మంత్రి బొత్స సత్యనారాయణ సైతం అశోక్‌పై విమర్శలు చేసిన సందర్భం లేదని చెబుతున్నారు. మరి చూడాలి ఈ మాన్సాస్ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో?