ఒక్కోసారి..సాయం కోసం ఎంత ఎదురు చూసినా ఎవరూ కనికరించరు.. మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది.. కానీ ఇప్పుడు జరిగిన ఘటన అందుకు పూర్తి భిన్నంగా ఉంది.. తన పిల్లల ఆకలి తీర్చేందుకు కాస్త సాయం కావాలంటూ కోరిన కేరళ మహిళకు, సోషల్ మీడియా నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆమెకు విరాళాల రూపంలో లక్షలాది రూపాయలు అందాయి.. 500 సాయంగా కావాలని కోరిన తనకు.. ఏకంగా 55 లక్షలు సమకూర్చారు..
46 ఏళ్ల సుభద్ర కేరళలో నివసిస్తున్నారు. భర్త మరణించడంతో తన బిడ్డల పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమె.. వారి ఆకలి తీర్చేందుకు రూ. 500 సాయంగా కావాలంటూ తన కొడుకు అభిషేక్ చదువుతున్న స్కూల్‌లో టీచర్‌ను సాయం అడిగింది. ఆమె పరిస్థితిని చూసిన టీచర్, సోషల్ మీడియాలో క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఆదివారం నాటికి ఆ కుటుంబానికి విరాళాల రూపంలో రూ. 55 లక్షలు అందాయి. ఆగస్టులో ఆమె భర్త చనిపోయిన తర్వాత నుంచి సుభద్ర చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆమె కుటుంబానికి పూట గడవడమే కష్టమయింది. అక్కడి తల్లులకు ఆకలితో చనిపోయిన బిడ్డలను పాతిపెట్టే శక్తి కూడా లేదు. తన ముగ్గురు కొడుకుల్లో చిన్న కొడుక్కి సెరిబ్రల్ పాల్సి వ్యాధి ఉండటంతో సుభద్ర ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి.. చిన్న కొడుకును నిత్యం దగ్గరుండి చూసుకోవాలి..
శుక్రవారం తన రెండో కొడుకు చదివే స్థానిక పాఠశాల టీచర్ గిరిజ హరికుమార్ వద్దకు సుభద్ర వచ్చారు. తన పిల్లలకు తినేందుకు ఏమీ లేవని, దయచేసి ఏదైనా సాయం చేయాలని కోరారు. గిరిజ హరికుమార్ ఆ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తన విద్యార్థి అభిషేక్‌ను తాను ఎన్నోసార్లు అడిగినట్టు గిరిజ హరికుమర్ చెప్పారు.
కానీ మొట్టమొదటిసారి అభిషేక్ తల్లి తన సాయం కోరారని తెలిపారు. ‘‘నేను రూ. 1000 ఇచ్చాను. ఎలాగైనా సాయం చేస్తానని ఆమెకు చెప్పాను’’ అని టీచర్ చెప్పారు. ఆ తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లగా వారెంత పేదరికంలో జీవిస్తున్నారో అర్థమైందని చెప్పారు. వంటగదిలో కనీసం నాలుగు గింజలు కూడా లేవని, వారి వద్ద తినడానికి ఏమీ లేవని గిరిజ హరికుమార్ తెలిపారు. అందుకే ఆ కుటుంబ దీనస్థితిని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినట్టు గిరిజ హరికుమార్ తెలిపారు.
అలాగే ఆ పోస్టులో సుభద్ర బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా జత చేశారు. దీంతో దాతలు అందించే డబ్బు నేరుగా సుభద్ర అకౌంట్లో పడింది. టీచర్ గిరిజ హరికుమార్ షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సోమవారం నాటికి పలువురు గుర్తు తెలియని దాతల నుంచి సుభద్ర అకౌంట్‌కి రూ. 55 లక్షల విరాళం అందింది. దాతల నుంచి పొందిన డబ్బులో కొంత మొత్తాన్ని సుభద్ర ఇంటి నిర్మాణానికి ఉపయోగించనున్నారు. ఆమె భర్త చనిపోవడానికి ముందు ఆ ఇంటి నిర్మాణం ప్రారంభించగా.. ఆయన చనిపోవడంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ ఫండ్ రైజింగ్ అభ్యర్థనను క్లోజ్ చేశారు.