బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసేందుకు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రఘునందన్ రావు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ పై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
బీహార్ గుండా రాజ్యాన్ని తెలంగాణలో తెస్తాం అంటే అంజనీకుమార్ ని త్వరలోనే ఇక్కడి నుంచి పంపిస్తామంటూ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారిపై ఇలా బాధ్యతారహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు.