సంక్షేమం విషయంలో జగన్ పాలనకు వంక పెట్టడానికి లేదనే సంగతి తెలిసిందే…చెప్పిన సమయానికి చెప్పినట్లుగా పథకాలు వచ్చారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా పథకాలు ఆగలేదు. అయితే పథకాలు ఒకటి ఇస్తే సరిపోతుందా..ప్రజలు సంతృప్తిగా ఉంటారా? అంటే కష్టమనే చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి..అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. అయితే అభివృద్ధి విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు.
అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జగన్..పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేసి ముందుకెళుతున్నారు. ఇక అన్నిటికంటే కీలకమైన ఉద్యోగ కల్పనపై జగన్ ఫోకస్ పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక రెండు లక్షల పైనే వాలంటీర్లు, లక్ష పైనే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఇవి అసలైన ఉద్యోగాలా? అంటే ఇందులో సచివాలయ ఉద్యోగాలని కాస్త లెక్కలోకి తీసుకోవచ్చు గాని..వాలంటీర్లు ఉద్యోగాలు కింద చెప్పలేం.
అవి తప్ప పెద్ద నోటిఫికేషన్లు జగన్ ప్రభుత్వం వదలలేదు. దీనిపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు..ఎప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వదులుతారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు గాని..ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు. దీంతో యువత చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి..ఈ క్రమంలో జగన్ సంచలన నిర్ణయాలు దిశగా వెళుతున్నారు.
సరైన సమయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వదులుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక పోలీస్ ఉద్యోగాల్లో హోమ్ గార్డులకు సెపరేట్‌గా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేశారు. అయితే రానున్న రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వదిలే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని యువత ఓట్లు పోకుండా..ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వదిలే ఛాన్స్ ఉంది.