ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వయనాడ్‌లో ఆయన తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. శుక్రవారం నాడు.. వయనాడ్‌లో రాహుల్‌గాంధీకి చెందిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయంలోని సామాగ్రి ధ్వంసం అయ్యింది. ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
ఈ దాడికి చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా… కేరళలోని సీపీఎం ప్రభుత్వమే ఈ దాడికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేరళ పోలీసుల కళ్లెదుటే దుండగులు దాడికి దిగారని కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వెరసి ఈ దాడి వెనుక సీపీఎం ఉందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే… ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కేరళ సీఎం పినరయి విజయన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.