దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును రెండు రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన బుచ్చిబాబును అరెస్టు చేసిన సీబీఐ.. ఆయనను దిల్లీ రౌస్ అవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చింది. నాడు న్యాయస్థానం బుచ్చిబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం విదితమే.
ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న బుచ్చిబాబును విచారించేందుకు అనుమతించాలంటూ ఈడీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం ఆయనను రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మద్యం విధానంలో ఇప్పటికే పలుమార్లు బుచ్చిబాబును సీబీఐ విచారించగా తాజాగా ఈడీ రంగంలోకి దిగింది.
ఇదే కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్, హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై విచారణ సమయంలో వెల్లడించిన సమాచారం ఆధారంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు బుచ్చిబాబును కస్టడీకి కోరినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.