కెనాడాలోని ఆటో మొబైల్ పరిశ్రమల్లో ఇప్పుడు వైద్య పరికరాల తయారీ శరవేగంగా కొనసాగుతున్నది. ఆటో మొబైల్ కంపెనీల్లో వాహన సంబంధ పనిముట్లు తయారు కావాలిగానీ, వైద్య పరికరాలు తయారవడమేంది అనుకుంటున్నారా? అవునండీ మీరు చదివేది నిజమే! అక్కడి ఆటో మొబైల్ కంపెనీల్లో వైద్య పరికరాలు, ఇతర వైద్య సంబంధ ఉత్పత్తులే తయారవుతున్నాయి! మరి అందుకు కారణం ఏమిటో తెలుసుకుందామా..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఆ క్రమంలోనే కెనడా ప్రభుత్వం కూడా తమ దేశంలోని ఆటోమొబైల్ కంపెనీల్లో వైద్య పరికరాలను తయారు చేయిస్తున్నది. కరోనా మరింత విస్తరిస్తే దేశంలో వైద్య సంబంధ ఉత్పత్తులకు కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన కెనడా గవర్నమెంట్.. ఈ మేరకు చర్యలు చేపట్టింది.
కాగా, తాము చేపట్టిన చర్యలవల్ల అత్యవసరాలైన సర్జికల్ మాస్కులు, రెస్పిరేటర్లు, స్క్రీనింగ్ టెస్టు పరికరాలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగించే జెల్‌లు ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఉత్పత్తి వేగం పుంజుకుందని కెనడా ప్రధాని ట్రూడో అభిప్రాయపడ్డారు. తన సతీమణికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెతో కలిసి ఒట్టావోలోని తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేటింగ్‌లో ఉన్న ట్రూడో అక్కడి నుంచే మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్స్ తయారు చేసే ఆటో మొబైల్ కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ట్రూడో హామీ ఇచ్చారు. కాగా, కెనడాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ముగ్గురు మరణించారు.