అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం 1వేయి సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరదని, ఎంతటి తీవ్రమైన భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చినా సరే.. తట్టుకుని నిలబడే శక్తి రామ మందిరానికి ఉంటుందని.. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో తాజాగా మాట్లాడారు.
నదుల్లో బ్రిడ్జిలకు వేసేంత దృఢంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని, అవి చాలా లోతుగా ఉంటాయని, పిల్లర్లు చాలా దృఢంగా ఉంటాయని తెలిపారు. అందువల్ల తీవ్రమైన భూకంపాలు వచ్చినా.. ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా సరే.. అయోధ్య రామ మందిరం 1వేయి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు.
కాగా ఆలయాన్ని నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీకి ఆలయాన్ని దృఢంగా నిర్మించాలని చెప్పినట్లు తెలిపారు. ఇక రామజన్మభూమి తవ్వకాల్లో బయట పడ్డ శిల్పాలను ఆలయంలో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు ట్రస్టుకు భక్తుల నుంచి రూ.42 కోట్ల వరకు విరాళాలు అందాయన్నారు. రూ.1 మొదలుకొని రూ.1 కోటి వరకు అనేక మంది విరాళాలు ఇస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ మోదీ అయోధ్యకు వచ్చి భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పోరాటంలో 20వేల మంది వరకు పాల్గొన్నారని, వారందరినీ ఆహ్వానించకపోవడం విచారకరమని అన్నారు. కరోనా వల్లే 90 మంది ముఖ్యమైన ఉద్యమకారులను ఆహ్వానించామని తెలిపారు.