స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో కరోనా బారిన పడి ఇళ్లలో చికిత్స తీసుకునే వారు రక రకాల ఇంగ్లిష్ మెడిసిన్లను వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వారిపై ఆయుష్ 64 ట్యాబ్లెట్లు బాగానే పనిచేస్తున్నాయని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి వల్ల కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటున్నారని తెలియజేసింది.
ఆయుష్ 64 మెడిసిన్‌ను 1980లలోనే తయారు చేశారు. దీన్ని మలేరియా, ఇతర వ్యాధుల చికిత్సకు అప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు. అయితే కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు దీన్ని వాడితే త్వరగా కోలుకుంటున్నారని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఈ మెడిసిన్‌ను ప్రజలకు అందజేయాలని ఆ మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకుంది.
ఆయుష్ 64 మెడిసిన్‌ను తయారు చేసేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని, ఆ మెడిసిన్‌ను తయారు చేసేందుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా ఇస్తామని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయుష్ 64 మెడిసిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా భారీ సంఖ్యలో ఆ ట్యాబ్లెట్లను కోవిడ్ బాధితులకు అందజేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫార్మా కంపెనీలు ఈ మెడిసిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ముందుకు రావాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది.