ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ ఆచితూచి అడుగులేస్తోంది. ప్రజలను ఆకర్షించే పథకాలను తీసుకొస్తుంది. టీడీపీ అధినేత అలుపు ఉన్నది లేకుండా అహర్నిశలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా.. కదిలి రా.. బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సంక్షేమ పథకాలకు నాంది పలికింది టీడీపీ అని పేర్కొన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వంద పథకాలను రద్దు చేశారని మాజీ సీఎం నారా చంద్రబాబు ఆరోపించారు.
జగన్ పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారన్న ఆయన తాను అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కి గ్యారంటీ.. పేరిట సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగాన్ని నిర్మూలించేవిధంగా చర్యలు తీసుకుంటామని.. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మహాలక్ష్మీ పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని పేర్కొన్నారు. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.