మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కి బెయిల్ మంజూరు చేసింది ముంబై కోర్టు. భూ కుంభకోణం కేసులో ఈడి సంజయ్ రౌత్ ని ఈ ఏడాది జూలై 31 అరెస్టు చేసింది. అప్పటినుండి ఆయన ముంబైలోని ఆర్థర్ జైల్లోనే ఉన్నారు. కాగా వంద రోజులు అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుకు ముందు సంజయ్ రౌత్ ఇంట్లో తొమ్మిది గంటలపాటు సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు సుమారు 11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అందులో పది లక్షల రూపాయలు ప్రత్యేక కవర్ లో ఉన్నట్లు సమాచారం. తనను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత వారం కోర్టులో విచారణ జరగగా భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉందని, ఆయనకి బెయిల్ ఇవ్వద్దని ఈడి కోరింది. అయితే నేడు ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంజయ్ రౌత్ కి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది.