లాక్ డౌన్ తరువాత టాలీవుడ్ కు మళ్లీ ఆశలు చిగురించేలా చేసిన సినిమా ‘ అఖండ’. నందమూరి నటసింహం బాలకృష్ణ ఫవర్ ఫుల్ యాక్షన్.. బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, థమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసి ‘ అఖండ’ సినిమాకు సాలిడ్ హిట్ అందిచాయి. బాలయ్య ‘ అఖండ’ ఇచ్చిన ఊపుతో పెద్ద సినిమాల నిర్మాతలకు, హీరోలకు తమ సినిమాల మీద కలెక్షన్ల పరంగా నమ్మకాన్ని చిగురించేలా చేశాయి. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా అరుదు. అలాంటి నయా రికార్డ్ ను బాలయ్య మరోసారి నెలకొల్పాడు. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈసినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఏ సెంటర్ అయినా.. జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోయింది. బాలయ్య కెరీర్ లోనే రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఓటీటీలో రిలీజ్ అయిన ‘ అఖండ’ అక్కడ కూడా రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. అఘోరాగా బాలయ్య యాక్షన్ సినిమాకే హైలెట్. ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య రెండు పాత్రల్లో జీవించాడు. మరోవైపు విలన్ గా శ్రీకాంత్ తన విలనీజాన్ని చూపిండాడు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్, జగపతి బాబులు కీలక పాత్రల్లో నటించారు.
ఇదిలా ఉంటే ‘ అఖండ’ వందరోజులకు చేరువ అవుతున్న తరుణంలో కృతజ్ఞత సభ నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. మార్చి 12న ఎస్టీబీసీ గ్రౌండ్ కర్నూల్ లో భారీ సభకు ప్లాన్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కానుంది. దీంతో బాలయ్య అభిమానులకు మరో పండగ వచ్చినట్లే ఇక.