ఏ హీరో అయినా సరే తమకు నచ్చిన కథలను సినిమాలుగా తెరకెక్కిస్తూ ఉంటారు కానీ స్టార్ హీరో బాలయ్య విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ గతంలో తన తండ్రి చెప్పనిదే ఏ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు కాదట. ఈ క్రమంలోనే తనకు ఇష్టం లేకపోయినా సరే తన తండ్రిని కాదనలేక ఆయనపై భయం వల్లే ఒక సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.
తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి వారంలోని రూ.100 కోట్ల మార్కు అందుకోవడంతో సినిమా సక్సెస్ మీట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై బాలకృష్ణ ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే తన తండ్రి కోసం శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో నటించాను అని.. అయితే ఇందులో నాన్నగారి మీద భయంతోనే చేశానని బాలయ్య కామెంట్లు చేశారు.
నాన్నగారు సెలవు పెట్టమని అడిగితే సెలవు పెట్టి షూటింగ్లో పాల్గొనే వాడిని అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఏ ప్రాపర్టీ ఇచ్చినా దానిని ఎలా వాడుకోవాలో నాన్న నుంచి నేర్చుకున్నాను అని తెలిపారు. లెజెండ్ సినిమాలో గుర్రంతో గ్లాస్ బ్రేక్ చేసే సీన్స్ సొంతంగా చేశానని బాలయ్య తెలిపారు. బోయపాటి శ్రీను గ్రాఫిక్స్ లో చేద్దామని చెప్పినా సరే నేను వినకుండా చేశాను అంటూ బాలయ్య తెలిపారు. ఇకపోతే తన సినిమాల టైటిల్స్ తన నేచర్ కు తగ్గట్టుగా ఉంటాయని.. తన సినిమాలు అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చాలి అని భావిస్తానని ఈ సందర్భంగా బాలయ్య చెప్పుకొచ్చారు.