ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేర్చుకున్న 12 మందిని వెంటనే రాజీనామా చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కు ప్రజా కోర్టుకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. తాము బైపోల్ కు రెడీ అని తెలిపారు.
“మునుగోడు గెలుపు కేసీఆర్‌దా? కేటీఆర్‌దా? హరీశ్‌రావుదా? సీపీఐదా, సీపీఎందా? కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి. ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల మెజార్టీ. ఒక్కో పోలింగ్ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున కార్యకర్త పనిచేశారు. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బీజేపీ కార్యకర్తతో సమానం. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.’-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇచ్చిన హామీ మేరకు మునుగోడు సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమిపై సమీక్ష చేసుకుని.. అధికారమే లక్ష్యంగా అభివృద్ధికోసం పనిచేస్తామన్నారు.