కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ పట్టణ రైతులంతా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనతో ప్రస్తుతం కామారెడ్డి అట్టుడికిపోతోంది. ఈ ఆందోళనను కొనసాగిస్తూ ఇవాళ కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చింది రైతు జేఏసీ. ఈ బంద్‌కు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా.. తాజాగా బీజేపీ కూడా తన సంఘీభావం ప్రకటించింది.
ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నాయకులతో కలిసి కామారెడ్డికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కామారెడ్డికి బండి సంజయ్ బయల్దేరి వెళ్లనున్నారు. అనంతరం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
మరోవైపు కామారెడ్డిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసి ఉంచారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. బీజేపీ నేత వెంకటరమణారెడ్డిని అర్ధరాత్రి గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.