బెంగళూరు వాసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా సీజ్ చేయబడిన వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి వాహనాలను పోలీసులు యజమానులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు.
బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. లాక్‌డౌన్‌లో సీజ్ చేయబడిన వాహనాలను మే 1వ తేదీ నుంచి యజమానులకు తిరిగి అప్పగించనున్నామని తెలిపారు. వాహనదారుల పత్రాలను పరిశీలించి ఎవరి వాహనాలను వారికి ఇచ్చేస్తామన్నారు. రాష్ట్ర సీఎం, హోం మంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కాగా బెంగళూరులో లాక్‌డౌన్ సమయంలో మొత్తం 50వేల వరకు వాహనాలను అక్కడి పోలీసులు సీజ్ చేశారు. వాటిలో కార్లు, ఆటోలు, టూ వీలర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వాహనదారులు కోర్టులో తమ వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను చూపించి వాహనాలను పోలీస్ కస్టడీ నుంచి విడిపించుకోవాల్సి ఉంటుంది.