బంగార్రాజుకు పండగ కళ వచ్చేసింది.. చై,కృతి, నాగ్, రమ్య కృష్ణ జోడీలు భలే ఎదురుపడుతున్నాయి..భలే నవ్విస్తాయి కూడా.. నాగ్ చేసే అల్లరి పనులు,చిలిపి చేష్టలు, కొత్త జంట చై, కృతి ఒకరినొకరు తిట్టుకునే రీతి, ప్రేమించికునే తీరు ఇవన్నీ కూడా సినిమా ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాయి. అదేవిధంగా మిగతా నటీనటలు కూడా బాగా చేశారన్నది నాగ్ చెబుతున్న మాట.తాను అనుకున్నదానికి మంచి ఔట్ పుట్ తీసుకుని రాగలిగామని,అదీ తక్కువ సమయంలోనే ఇది సాధ్యం అయిందని అంటున్నారీయన.
ఓ సినిమాకు సీక్వెల్ స్టోరీ రాయడం, కొనసాగింపు తీయడం అన్నవి చాలా కష్టం. ఎందుకంటే ముందున్న మూలాలు చెడిపోకూడదు..అంచనాలు మారిపోకూడదు. ఇంకా చెప్పాలంటే అంచనాలు మారకుండా పనిచేస్తూనే ముందున్న సినిమాలో పాత్రల కొనసాగింపు రాయాలి. ఆ విధంగా పనిచేస్తూనే హిట్ టాక్ అందుకోవాలి. ఈ సారి సీక్వెల్ లో అన్నీ బాగా కుదిరాయి అని అంటున్నారు నాగార్జున. ఆయన ఎంతోనమ్మకంతో కథపై ఉన్న నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు ఈ సంక్రాంతికి రానున్నారు.
సోగ్గాడే చిన్ని నాయనా సక్సెస్ తరువాత నాగార్జున ఓ ప్రీక్వెల్ ను ప్లాన్ చేశారు. తరువాత అది స్వీకెల్ గా మారిపోయింది. అసలు బంగార్రాజు కథ ఆ సినిమాలో చెప్పలేదని పేర్కొంటూ ప్రీక్వెల్ చేద్దామనే ముందు అనుకున్నారు. కానీ తరువాత పరిణామాలు, సంబంధిత మార్పులు నేపథ్యంలో సీక్వెల్ కు ప్లాన్ చేశారు..అనుకున్న విధంగా కథ రాసేందుకు చాలా సమయం కల్యాణ్ కృష్ణ (దర్శకులు) తీసుకున్నారని అంటున్నాడు నాగ్. బంగార్రాజు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆయన వివిధ మీడియా మీట్లలో చాలా విషయాలు చెబుతున్నారు. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనాలో కథ ఎక్కడ ముగుస్తుందో అక్కడ నుంచే బంగార్రాజు కథ మొదలవుతుందని అన్నారు.అదేవిధంగా ఈ సినిమా ఫలితం చూసుకుని మరో సినిమాకు ప్లాన్ చేస్తామని అది కూడా బంగార్రాజు కథకు కొనసాగింపుగానే ఉంటుందని అన్నారు.