బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపోర్ సెక్టార్‌లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశీయులు దాడికి పాల్పడ్డారు. జవాన్లను విచక్షణారహితంగా కొట్టి వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. కొన్నిరోజులుగా నిర్మల్‌చార్ ఔట్‌పోస్ట్ సమీపంలోని భారతీయుల వ్యవసాయ క్షేత్రాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన గ్రామస్థులు వారి పశువులను మేపుతున్నారు. రైతులు బీఎస్‌ఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్‌చార్ ఔట్‌పోస్ట్ వద్ద ఇద్దరు జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సరిహద్దులు దాటుకుని బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు తమ పశువులను మేపడానికి వచ్చారు. బందోబస్తు విధుల్లో ఉన్న జవాన్లు వారిని అడ్డుకోగా గొడవకు దిగి జవాన్లను విచక్షణారహితంగా కొట్టారు. పదునైన ఆయుధాలతో దాడిచేశారు. సమాచారం అందుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను చెదరగొట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. జవాన్లపై విచక్షణారహితంగా దాడి చేసి, వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దాడి ఘటన అనంతరం బీఎస్‌ఎఫ్ అధికారులు బంగ్లాదేశ్ ఆర్మీతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు.