ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలు సిమ్ కార్డులకు కొదవే లేదు. ఎన్ని ఎటిఎం కార్డులు ఉంటే అంత మంచిది అని భావిస్తున్న చాలా మంది ఎక్కువగా బ్యాంకు ఖాతాలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొందరు అయితే…ఉద్యోగం మారినప్పుడు ఒక ఖాతా… గృహ రుణాలకు ఒక ఖాతా, గృహ అవసరాలకు ఒక ఖాతా, భార్యకు ఇవ్వడానికి ఒక ఖాతా, పిల్లల కోసం ఒక ఖాతా, వ్యాపార అవసరాలకు ఒకటి… ఇలా ఇష్టం వచ్చినట్టు బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు. దీని వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు.
మారిన ప్రభుత్వ విధానాల కారణంగా… బ్యాంకులు కనీస మొత్తం అని ఒక నిభందన విధిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకు లు అయితే కనీసం 5000 నుంచి 10 వేల వరకు కనీసం ఉండాలని లేకపోతే నెలకు ఇంత అని చార్జీలు విధిస్తున్నాయి. ఖాతా తెరిచిన కొత్తలో భాగానే ఉన్నా… ఆ తర్వాత దానిని వాడక చాలా మంది డబ్బులు వృధా చేసుకుంటున్నారు. ఇక వాడే వారు అయితే ఇలా 4,5 ఖాతాల్లో 40 నుంచి 60 వేల వరకు నిధులు ఉంచుతున్నారు. వాటికి వడ్డీలు రాక, బయటకు తీసి వాడలేక ఇబ్బంది పడుతున్నారు.
బ్యాంకుల్లో ఉన్న కనీస నిల్వలపై 3-4 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. అదే మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడితే ఎక్కువ మొత్తం వస్తుంది. శాలరీ ఎకౌంటు లేదా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ మూడు నెలలు డిపాజిట్ చేయకపోతే ఆ తర్వాత అది సాధారణ ఖాతగా మారిపోతుంది. అప్పుడు నిల్వ ఉంచడం తప్పని సరిగా మారుతుంది. ఇక ఆదాయపు పన్ను సమర్పించేటప్పుడు అన్ని ఖాతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ లు మర్చిపోతు ఉంటారని ఇది కూడా ఒక నష్టమని అంటున్నారు.