ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల సంఖ్య భారీగా పెరిగిన విషయం విదితమే. దేశంలో పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్‌ల వినియోగం పెరిగింది. దీంతో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే బ్యాంకుల సర్వర్లలో వస్తున్న సాంకేతిక సమస్యల వల్ల ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ఫెయిలవుతున్నాయి. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే నిజానికి 2019 సెప్టెంబర్ 20 నుంచే ఆర్‌బీఐ ఒక రూల్‌ను అమలు చేస్తోంది. బ్యాంకులకు సంబంధించి కస్టమర్లు ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తే ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే 7 రోజుల్లోగా బ్యాంకులు రీఫండ్ ఇవ్వాలి. కానీ 7 రోజులు దాటాక కూడా రీఫండ్ రాని పక్షంలో కస్టమర్లు ఆ రీఫండ్ వచ్చే వరకు రోజుకు రూ.100 అదనపు నష్టపరిహారం పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యాక 7 రోజుల్లోగా డబ్బులు రీఫండ్ అవకపోతే కస్టమర్లు తమ బ్యాంక్‌కు చెందిన బ్రాంచికి వెళ్లి అక్కడ అనెక్షర్ 5 ఫాంను నింపి కంప్లెయింట్ ఇవ్వవచ్చు. ఆ తరువాత రీఫండ్ వచ్చే వరకు రోజుకు రూ.100 అదనపు నష్ట పరిహారాన్ని బ్యాంకులు కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం నిజానికి చాలా మందికి తెలియదు. కనుక అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.