ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీరియస్ గా ఉన్న ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి గవర్నర్ వద్దకు వెళ్ళారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై శాసనసభ చేసిన తీర్మానం పై గవర్నర్ కు లేఖ రాసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగంలోని 243 కె అధికరణ కింద ఎన్నికల కమీషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందన్నారు.
ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరపడం కమీషన్ విధి అని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు సమాన అధికారాలు ఉన్నాయి అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని ఆయన పేర్కొన్నారు. అటువంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించండి అని కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయ నిపుణులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు.