బ్యాంకుల‌కు షాక్‌.. ఆ చార్జిల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు తిరిగి ఇచ్చేయాల్సిందే..!

-

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) బ్యాంకుల‌కు షాకిచ్చింది. డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చేసిన చెల్లింపుల‌కు విధించిన, వ‌సూలు చేసిన చార్జిల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు తిరిగి ఇచ్చేయాల‌ని బ్యాంకుల‌కు ఆదేశించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఈ రూల్ అమ‌లులోకి వ‌చ్చింద‌ని పేర్కొంది. క‌నుక బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌సూలు చేసిన ఆ చార్జిల‌ను వెన‌క్కి ఇచ్చేయాల‌ని, ఇక‌పై ఆ చార్జిల‌ను వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.

banks do not collect charges on digital transactions says cbdt

కాగా ప‌లు బ్యాంకులు రుపే డెబిట్ కార్డు, యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్‌, భీమ్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు చేసిన ట్రాన్సాక్ష‌న్ల‌కు చార్జిల‌ను వసూలు చేస్తున్నాయ‌ని సీబీడీటీ దృష్టికి వ‌చ్చింది. దీనికి స్పందించిన సీబీడీటీ పై విధంగా ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు ఆ చార్జిల‌ను వ‌సూలు చేయ‌డం అంటే పీఎస్ఎస్ యాక్ట్ సెక్ష‌న్ 10ఎ, ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 269యు ల‌ను ఉల్లంఘించిన‌ట్లేన‌ని తెలిపింది. అందుకుగాను బ్యాంకుల‌పై ఐటీ యాక్ట్ సెక్ష‌న్ 271 డిబి, పీఎస్ఎస్ యాక్ట్ సెక్ష‌న్ 26 ల ప్ర‌కారం జ‌రిమానా విధిస్తామ‌ని సీబీడీటీ స్ప‌ష్టం చేసింది.

కాగా బ్యాంకులు పైన తెలిపిన మాధ్యమాల్లో క‌స్ట‌మ‌ర్లు చేసిన చెల్లింపుల‌కు ఏవైనా చార్జిల‌ను వ‌సూలు చేసి ఉంటే వెంట‌నే వాటిని క‌స్ట‌మ‌ర్ల‌కు తిరిగిచ్చేయాల‌ని సీబీడీటీ స్ప‌ష్టంగా తెలిపింది. బ్యాంకుల‌న్నీ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, ఆయా డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల్లో క‌స్ట‌మ‌ర్లు చెల్లింపులు చేస్తే వాటికి అద‌నంగా చార్జిల‌ను వ‌సూలు చేయ‌రాద‌ని సీబీడీటీ స్ప‌ష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news