ఈనెల 11న ఈడీ ఎదుట హాజరుకానున్న కవితకు మద్దతుగా హైదరాబాద్, దిల్లీల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు వెలిశాయి. భారత్‌ను బీజేపీ నుంచి రక్షించాలి.. మేమంతా కవితక్క వెంటే ఉంటాం అంటూ బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.
సామాజిక మాధ్యమాల్లోనూ కవితకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించిందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం విమర్శించారు. తెలంగాణలో ద్విచక్రవాహనంపై తిరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రూ.వెయ్యి కోట్ల ఆసామి అయ్యాడు.. కర్ణాటకలో ప్రజాప్రతినిధుల ఇంట్లో రూ. కోట్లు బయటపడ్డాయి.. మరి వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.