తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం వేడెక్కుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీలు అన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
సమాజ శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజారిటీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని.. రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్త శుద్దితో పని చేస్తున్నట్టు చెప్పారు. ఆ లక్ష్యం దిశగా బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు. గత బీసీ కమిషన్ కులగణన విషయంలో ఎంత మేరకు పని చేసిందో వివరాలు తెప్పించుకొని వాటిని పరిశీలించి వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీసీ కుల సంఘాలు సహకరిస్తే.. ఎన్నికల లోపే కులగణన జరగకపోవడం ఉండదని.. బీసీ సంఘాలు సహకార బాటలో ఉండాలని కోరారు.