యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ జరగనున్న విషయం విదితమే. అందుకు ఇంకా మరో 3 వారాల గడువు మాత్రమే ఉంది. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం ఇంకా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. దీంతో ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
యూఏఈలో దుబాయ్, అబు ధాబి, షార్జాల్లో ఐపీఎల్ 2020 టోర్నీ జరగనున్న విషయం విదితమే. ఆ మూడు స్టేడియాల్లోనే టోర్నమెంట్‌ను నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక సిటీకి, మరొక సిటీకి మధ్య రాకపోకలను నిషేధించారు. మరో వైపు దుబాయ్‌లో ఈ సమయంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎక్కువ మ్యాచ్‌లను రాత్రి పూటే నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ప్రకటించాలి. కనుకనే ఈ రెండు కారణాల వల్లే ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆయా విషయాలపై ప్రస్తుతం బీసీసీఐ యూఏఈ అధికారులతో చర్చిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాక.. అంటే.. మరో వారం రోజుల్లోగా ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటిస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ప్లేయర్ల క్వారంటైన్‌పై కూడా స్పష్టత రాలేదు. ఆయా దేశాల ప్లేయర్లు ఇప్పటికే సిరీస్ ఆడుతున్నారు. ఇప్పటికే వారు ఆయా దేశాల్లో బయో సెక్యూర్ బబుల్‌లో ఉన్నారు. అందువల్ల అటు నుంచి ఇటు వచ్చి వారు క్వారంటైన్‌కు వెళ్లకుండా నేరుగా ఇతర ఐపీఎల్ టీంలతో కలవవచ్చని పలు ఫ్రాంచైజీలు అంటున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు మాత్రం ఆయా దేశాల ప్లేయర్లు దుబాయ్‌కు వచ్చినా 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని కోరుతున్నాయి. అయితే బీసీసీఐ దీనిపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.