యూఏఈలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం బీసీసీఐ స్పాన్సర్ వివరాలను వెల్లడిస్తుందని తెలిసింది. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ఇప్పటికే జియో, టాటా సన్స్, బైజూస్, డ్రీమ్ 11 తదితర సంస్థలు పోటీ పడుతుండగా.. ప్రధానంగా జియో, టాటా సన్స్ మధ్యే అసలు పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు మంగళవారం తమ బిడ్లను బీసీసీఐకి సమర్పిస్తాయని తెలిసింది. దీంతో ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌ను బీసీసీఐ ఇవాళ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా వివో తప్పుకోవడంతో బీసీసీఐకి రూ.440 కోట్ల మేర నష్టం కలుగుతుందని అంచనా వేశారు. అయితే అందులో సగం అంటే.. రూ.220 కోట్లు వచ్చినా చాలని బీసీసీఐ భావిస్తోంది. అయినప్పటికీ ఈ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా కొత్త టైటిల్ స్పాన్సర్‌తో బీసీసీఐ రూ.300 కోట్ల వరకు రాబట్టుకోగలుగుతుందని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 2020 టైటిట్ స్పాన్సర్‌షిప్‌ను కేవలం ఈ ఏడాదికే పరిమితం చేయనున్నారు. వచ్చే ఏడాది వివోను ఉంచడమా.. శాశ్వతంగా కొన్ని సంవత్సరాలకు మళ్లీ కొత్త స్పాన్సర్‌ను ఎంపిక చేయడమా.. అనేది నిర్ణయిస్తారు.
కాగా దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఐపీఎల్ జరగనుంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు ఈనెల 20 తరువాత దుబాయ్‌కి బయల్దేరనున్నాయి.