ఈ ఏడాది వేసవిలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కరోనా కారణంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తరువాత కూడా పరిస్థితి మారకపోవడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఆంక్షలను సడలించినప్పటికీ భారత్‌లో ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ ఈ సారి టోర్నీని దుబాయ్‌కి షిఫ్ట్ చేసింది. గతంలో దుబాయ్‌లో టోర్నీని నిర్వహించిన అనుభవం దృష్ట్యా దుబాయ్ అయితేనే టోర్నీకి బాగుంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ టోర్నీని అక్కడికి మార్చింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఐపీఎల్ జరుగుతుందని కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వచ్చే వారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఆదివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మేరకు కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరిపారు. ఐపీఎల్ టోర్నీ నిర్వహణ దృష్ట్యా పలు అంశాలపై గంగూలీ సభ్యులతో చర్చించారు. టోర్నీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు ప్లేయర్లు ఏం చేయాలి, ఏం చేయకూడదు.. తదితర అంశాలతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) బుక్‌లెట్‌ను ఫ్రాంచైజీలకు ఇచ్చే విషయమై చర్చించారు. వచ్చే వారం ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్‌ను ప్రకటించాక సదరు బుక్‌లెట్‌ను ఫ్రాంచైజీలకు ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఇక యూఏఈలో మొత్తం 3 స్టేడియాల్లో ఐపీఎల్ 2020 జరుగుతుంది. దుబాయ్, షార్జా, అబుధాబిలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 24 మంది ప్లేయర్లను టోర్నీలో తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఎవరైనా ప్లేయర్‌కు కరోనా సోకితే ఐసీసీ నిబంధనల ప్రకారం రీప్లేస్‌మెంట్ సౌకర్యం కల్పిస్తారు. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి. వారాంతాల్లో రెండు మ్యాచ్‌లు జరిగితే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే మొదటి మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైతే ఈ సమాచారం తెలుస్తుంది.
ఇక ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఈసారి టోర్నీలో ఫైనల్ మ్యాచ్ వీక్ డే రోజు జరగనుంది. నవంబర్ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. గతంలో నవంబర్ 8 అని తేదీ ఇచ్చినా, ఇప్పుడు దాన్ని నవంబర్ 10కి మార్చారు. కాగా స్టేడియాల్లో 30 నుంచి 50 శాతం మంది ప్రేక్షకులకు అయినా అనుమతి ఇచ్చేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయనుంది. అందుకు అనుమతి లభిస్తే స్టేడియాల్లో ప్రేక్షకులు ఉంటారు. ఈ విషయంపై త్వరలో స్పష్టత వస్తుంది. ఇక ఐపీఎల్ టోర్నీని పూర్తిగా బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహిస్తారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ – వెస్టిండీస్ సిరీస్‌లో ఈ విధానంలోనే 3 టెస్టు మ్యాచ్‌లు నిర్వహించారు. ఎలాంటి కరోనా సమస్యలు లేకుండా ఆ సిరీస్ కొనసాగింది. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ధీమాతో ఉంది.