కరోనా వైరస్ ప్రభావం ఏమోగానీ.. సోషల్ మీడియాలో ఇప్పుడు దాని గురించి అనేక నకిలీ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కోళ్లకు కరోనా వైరస్ వచ్చిందని, కనుక చికెన్ తినకూడదనే వార్తలు నిన్న మొన్నటి వరకు వాట్సాప్‌లో ప్రచారమయ్యాయి. అయితే అదంతా వట్టిదేనని తేలడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కరోనా వైరస్‌కు చెందిన మరొక నకిలీ వార్త కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది. అదేమిటంటే…
బీర్లు ఇష్టంగా తాగే చాలా మందికి కరోనా బీర్ గురించి తెలిసే ఉంటుంది. అయితే అలాంటి వారిలో కొందరు పేరులో కరోనా ఉందని చెప్పి ఆ బీర్‌ను తాగడం లేదట. ఎందుకయ్యా అంటే.. కరోనా బీర్ తాగడం వల్ల కరోనా వైరస్ వస్తుందని అనుకుంటున్నారట. కానీ నిజానికి కరోనా బీర్‌కు, కరోనా వైరస్‌కు సంబంధం లేదు. రెండింటి పేర్లు ఒకటే. కానీ బీర్‌కు, ఆ వైరస్‌కు అస్సలు సంబంధమే లేదు.
అయితే ఆ విషయం తెలియని చాలా మంది బీర్ ప్రియులు కరోనా బీర్‌ను తాగడం లేదట. ముఖ్యంగా అమెరికాలోని బీర్ ప్రియుల్లో 34 శాతం మంది ఆ బీర్‌ను తాగేందుకు ఇష్టపడడం లేదట. కరోనా వైరస్ వస్తుందని చెప్పి ఆ బీర్‌ను తాగడం లేదని వారు అంటున్నారు. ఏది ఏమైనా.. కరోనా వైరస్ వల్ల కరోనా బీర్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇక ఆ వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గితేకానీ మళ్లీ కొందరు ఆ బీర్‌ను తాగేలా లేరు. ఇక ఆ వైరస్ కథ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి..!