ఇల్లు అన్నాక అందులోని గదులు, ఇతర ప్రదేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే కదా.. మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే శుభ్రతతోపాటు ఇంట్లో కమ్మని సువాసన వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో సహజ సిద్ధమైన వాసనను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడవచ్చు. లేదా పరిమళాన్ని వెదజల్లే అత్తరు, పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఎటు చేసీ ఇంట్లో సువాసన వచ్చేలా చూసుకోవాలి. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే…
1. ఇంటిని సువాసన వచ్చే విధంగా తీర్చిదిద్దుకోవడం వల్ల ఇంట్లో ఉన్న అందరి మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. అందరూ ప్రశాంతంగా ఉంటారు.
2. సాధారణంగా మనం హోటల్స్, థియేటర్లు వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రదేశాలు మనకు సువాసనను అందిస్తుంటాయి కదా. సువాసన వచ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తారు. దీంతో మనకు ఎప్పుడూ ఆ ప్రాంతాలు అలా గుర్తుండిపోతాయి. అలా ఇల్లు కూడా గుర్తుండిపోవాలంటే.. ఇంట్లో ఎప్పుడూ పరిమళం వెదజల్లేలా ఏర్పాటు చేసుకోవాలి.
3. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటే.. దాంతో ఆ సువాసన మనకు అరోమాథెరపీలా పనిచేస్తుంది. ఈ క్రమంలో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. చేసే ఏ పనినైనా శ్రద్ధగా చేస్తాం.
4. సహజంగానే మన చుట్టూ ఉండే వాతావరణంలో బాక్టీరియా, కాలుష్య కారకాలు, వైరస్ లు ఉంటాయి. అలాంటప్పుడు పరిమళాలను వాడితే ఆ క్రిములన్నీ నాశనమై మనకు శుభ్రమైన వాతావరణం లభిస్తుంది. రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
5. పరిమళాలతో ఇంటిని నింపితే ఇల్లు తాజాగా ఉంటుంది. బయటకు వెళ్లి రాగానే ఇంట్లోకి అడుగు పెడితే ఓ ఫ్రెష్ ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనస్సు ఉత్సాహంగా మారుతుంది. అప్పటి వరకు ఉన్న అలసట, నిస్సత్తువ ఒక్కసారిగా మాయమైపోతాయి. శరీరానికి ఉత్తేజం లభిస్తుంది.