కార్తీకంలో రుద్రాక్ష ధరిస్తే కలిగే లాభాలు ఇవే!!

-

రుద్రాక్షలు.. రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు. ఇవి పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.
రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. లలాటంపై విభూతి, కంఠానికి రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీకం శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ సమయంలో అభిషేకం చేయించిన తర్వాత రుద్రాక్షలను ధరిస్తే వాటి ఫలితం మరింత రెట్టింపు అవుతుంది. ఇహలోక సౌఖ్యాలు, పరమంలో పరమాత్ముడి సాన్నియుజ్యం లభిస్తాయి.

రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఇవే…
1. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
2. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
3. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
4. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
7. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
8. కనీసం పక్షానికి ఒక్కసారైనా పూజలో వాటిని ఉంచాలి.
9. ఆవుపాలు, గంగాజలం, భస్మంతో అభిషేకంతో రుద్రాక్షలను అభిషేకిస్తూ ఉంటే వాటివల్ల శక్తిమరింత పెరుగుతుంది.
10. వ్రతాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసుకున్నప్పుడు ఆ సమయంలో రుద్రాక్షలను కూడా పూజలో ఉంచి పూజిస్తే మంచిది.

రుద్రాక్షలను ఎప్పుడు ధరించాలి?
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.

ధరించవలసిన తిథులు:
రుద్రాక్షలను కొన్ని ప్రత్యేక తిథులలో ధరిస్తే మంచిది అవేవో తెలుసుకుందాం… పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్‌ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news