లాక్ డౌన్ ని క్రమంగా ఉల్లంఘించడం తో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఒక పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు అనుసరిస్తున్న శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రోడ్ల మీదకు ఎంత రావొద్దని చెప్తున్నా సరే ఎవరూ కూడా వినే పరిస్థితిలో లేరు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వినడం లేదు.
పోలీసులకు జనాలను కట్టడి చేయడం పెద్ద తల నొప్పిగా మారింది. కరోనా కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో జనం ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.
లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే జనంలో మార్పు రావడం లేదు. దీనితో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి రెండేళ్ళ జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించవద్దని భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర హోం శాఖ.