ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఒక్క అమరావతినే కాకుండా మూడుగా వికేంద్రీకరణ చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. రాజకీయంగా ఎన్నో విమర్శలు జగన్ ని చుట్టూ ముడుతున్నాయి. ఇక రెండు కమిటీల నివేదికలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. దీనితో విశాఖకు పరిపాలనా రాజధానితో పాటుగా, కర్నూలుకి హైకోర్ట్ వెళ్తుంది.
అంత వరకు అలా ఉంటే ఇక్కడే జగన్ కి ఒక సమస్య వచ్చేసింది. అది ఏంటీ అంటే, హైకోర్ట్ మార్పు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండదు. సచివాలయం తరలింపు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి శాఖలకు ఉత్తర్వులు వెళ్తాయి గాని హైకోర్ట్ విషయంలో అలా ఉండే అవకాశం లేదు. రాష్ట్రపతి అనుమతి అనేది తప్పనిసరిగా కావాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన జడ్జీలు, అనువైన స్థలాన్ని వెతుక్కోమని చెప్తే అమరావతిలో వెతుక్కున్నారు. అక్కడే భవనం నిర్మించారు విభజన జరిగింది.
సుప్రీం కోర్ట్ కి కూడా మార్చే అధికారాలు లేవు. కేవలం రాష్ట్రపతి నిర్ణయం మీద ఉంటుంది. సుప్రీం కోర్ట్ డివిజన్ బెంచ్ లు మాత్రమే ఏర్పాటు చెయ్యాలి. సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్‌ను రీ–నోటిఫై చేసే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. హైకోర్ట్ వెళ్ళకపోతే మాత్రం రాయలసీమలో జగన్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 31(2) ప్రకారం హైకోర్టును 2018 డిసెంబర్ 26న అమరావతిలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.