ఏపీ బీజేపీలో వర్గ పోరు పరాకాష్టకు చేరిందా? నాయకుల మధ్య సమన్వయం కనిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు తాజా పరిస్థితులను అంచనా వేస్తున్న విశ్లేషకులు. ఔను.. ఏపీ బీజేపీలో వర్గ పోరు నిజమేనని చెబుతున్నారు పార్టీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి. బీజేపీలోనే ఉంటూ.. వైసీపీని సమర్ధించే వర్గం ఒకటైతే.. టీడీపీ నుంచి బీజేపీలో చేరి.. టీడీపీకి అనుకూలంగా పనిచేసే వర్గం మరొకటైతే.. బీజేపీలోనే ఉంటూ.. అటు టీడీపీకి, అటు వైసీపీకి సానుకూలంగా చక్రం తిప్పే వర్గం ఇంకొకటి. ఈ మూడింటికీ భిన్నంగా ఉండే వర్గం మరొకటి అంటూ.. తేలిపోయింది. ఈ పరిణామాలతో బీజేపీ ఎప్పుడూ మీడియాలోనే ఉంటున్నా.. ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.
గత ఏడాది ఎన్నికల్లో బీజేపీకి 1.7 శాతం ఓట్ల షేర్ లభించింది. మరి ఈ పరిస్తితిని అధిగమించి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఈ వర్గాల్లో ఒక్కటి కూడా ప్రయత్నించక పోవడం గమనార్హం. అంతేకాదు, ఒకరి పై ఒకరు ఆధిపత్యం చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. రాజధాని విష యమే తీసుకుంటే.. టీడీపీకి అనుకూలంగా ఉండే.. బీజేపీ నేతలు.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటివారు రాజధాని ఎక్కడికీ తరలిపోదని చెబుతారు. అదేసమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయం లోనూ ఇదే తరహా వ్యాఖ్యానాలు చేశారు. అదేసమయంలో బీజేపీలోని మరో వర్గం మాత్రం.. అంతా కేంద్రం ఇష్టం.. అంటున్నారు.
ఇదిలావుంటే, పార్టీని డెవలప్ చేసేందుకు కానీ, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కానీ ఏఒక్కరూ పనిచేయక పోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిలో పార్టీ నిర్ణయించుకున్న 2024లో ఏపీలో అధికారం ఏమేరకు సాధిస్తారో చూడాలి. మొత్తంగా పరిశీలన చేస్తే.. బీజేపీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయనే చెప్పాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీని డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నించకపోగా.. ఇతర పార్టీల నుంచి వచ్చేవారితో తాము బలపడాలని అనుకోవడం గమనార్హం. ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరింత మందిని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరహా పరిస్థితి బీజేపీకి ఏమేలు చేస్తుందో చూడాలి.