హుజురాబాద్‌ ఉప ఎన్నిక : కాంగ్రెస్‌ కు మరో షాక్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజురాబాద్‌ లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాకముందే.. హుజురాబాద్‌ లో రాజకీయాలు వెడేక్కాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 600 మంది ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి గాంధీ చౌరస్తా వరకు భారీ ఎత్తున బైకు ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, యువత పాల్గొన్నారు.

అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రజలకు ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తెరాసా పార్టీ లో చేరి… పార్టీకి అండగా ఉంటామని యువత చెపుతున్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపునకు అందరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు.