నా శాఖలో దొంగలున్నారు.. బిహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

-

కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు బహిరంగ సమావేశాల్లో నోరు జారుతుంటారు. మరికొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. కొందరు తెలియక ఆవేశంలో మాట్లాడితే.. మరికొందరు స్పృహలో ఉండే కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా బిహార్ మంత్రి సుధాకర్ సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా తనపైన, సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు.

వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తన శాఖలోనే ఎంతోమంది దొంగలున్నారని, వారికి తానే సర్దార్‌ అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ రాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అక్కడితో ఆగకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ, ఆర్జేడీ అగ్రనేతలను వివాదంలోకి లాగారు. ఈ వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా దుమారం రేపాయి.

‘నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటీ లేదు. ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తోంది. కాబట్టి వారందరికీ నేను సర్దార్‌ను. నాపైనా ఎంతోమంది సర్దార్లున్నారు. ప్రభుత్వం మారింది. పనిచేసే తీరు మాత్రం అదే. అంతా గతంలో వలే ఉంది’ అంటూ నీతీశ్‌ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బిహార్‌ విత్తన సంఘంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ.. ఆ సంఘం రూ.200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013లో నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయనపై బియ్యం కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news