కాసేపట్లో ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్.. కీలక ప్రకటన ?

బీహార్‌ లో ఎన్నికల నగారా మోగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఇప్పటికే బీహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు జేడీయూ, బీజేపీ కూటమి తమ ప్రయత్నాలు చేస్తోంది. అయితే జేడీయూను ఓడించి ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని రాష్ట్రీయ జనతాదళ్ భావిస్తోంది. సుశాంత్ సింగ్ కేసు తర్వాత దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో సుశాంత్ కేసు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే ఈ కేసు విషయంలో బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తలెత్తడం, బీహార్ డీజీపీ స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ఎన్నికల బరిలోకి దిగనుండడంతో ఎన్నికల ప్రక్రియ మీదా, పరిణామాల మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు షెడ్యూలు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీతో పాటు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.