అనంతపురం జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరాం..టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారా? తనను పట్టించుకోవడం లేదని ఆయన రగిలిపోతున్నారా ? అంటే.. ఔననే అంటున్నాయి.. టీడీపీ వర్గాలు. గత ఏడాది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి.. రాప్తాడులో ఓడిపోయిన పరిటాల శ్రీరాం.. వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ లెవిల్లో పార్టీని తనవైపు తిప్పుకొనేందుకు, ముఖ్యంగా యువతను తనవైపు మళ్లించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాప్తాడు నుంచి పెనుకొండ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
దాదాపు నెల రోజులుగా ఆయన ఈ ప్లాన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా ఆయన చంద్రబాబు, లోకేష్‌లకు అందించారని పరిటాల వర్గం చెబుతోంది. దీనికి కారణాలు కూడా చూపిస్తోంది. పరిటాల రవి, ఎన్టీఆర్ విగ్రహాలను అధికారులు తొలిగించారు. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో వాటిని తొలిగించామని వారు చెబుతున్నా.. వైసీపీ నేతల దూకుడు కారణంగానే అధికారులు ఇలా నిర్ణయం తీసుకున్నారని పరిటాల వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయించడంతోపాటు.. పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు పాదయాత్ర అయితే బెటర్ అని శ్రీరాం భావించారు.
దీనికి సంబంధించి అనుమతి ఇవ్వాలని చంద్రబాబును ఆయన కోరారు. అయితే.. దీనికి చంద్రబాబు నుంచి నెల రోజులు గడిచినా.. అనుమతి దక్కలేదు. దీంతో శ్రీరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలో టాక్ నడుస్తోంది. అయితే, పార్టీలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీరాంకు అనుమతి ఇవ్వడం మంచిదే అయినా.. మరోపక్క, జేసీ వర్గం కూడా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉందని, తమను కేసుల్లో ఇరికిస్తే.. చంద్రబాబు అనుకున్న విధంగా స్పందించలేదని, ఈ సమయంలో ఒక వర్గానికి చంద్రబాబు అనుమతి ఇస్తే.. గ్రూపులు పెరిగి.. అసలు పార్టీకే ఎసరు వస్తుందని భావిస్తున్నారని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాత్సారం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు.. పెట్టుకుంటే అభ్యంతరం పెట్టే అవకాశం లేదని చెబుతున్నారు. ఏదేమైనా.. శ్రీరాం మాత్రం బాబు నుంచి ఎలాంటి సమాదానం లేక పోవడంతో ఫైర్ అవుతున్నారనేది వాస్తవమేనని చెబుతున్నారు. మరి ఈ అసంతృప్తి ఎటు దారి తీస్తుందో చూడాలి అంటున్నారు.
– Vuyyuru Subhash