సినీనటుడు, టీడీపీ నేత, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సా ధించిన నందమూరి బాలకృష్ణ ఉరఫ్ బాలయ్య.. ఈ నెల 10న తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిక విషయాలు వెల్లడించారు. ప్రధానంగా రాజకీయాల గురించి తీసుకుంటే.. తన నియోజకవర్గంపై ఆయనకున్న ఆలోచనలను పంచుకున్నారు. 2014లో తొలిసారి తాను ఇక్కడ నుంచి పోటీ చేసినప్పుడు.. ఇక్కడి ప్రజలు చూపించిన ఆదరణ మరిచి పోలేనని చెప్పారు.
అదేసమయంలో తొలి ఐదేళ్ల కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. తానుచేయాలనుకున్న పనుల్లో కొన్నింటిని మాత్రమే చెప్పానని నిర్మొహమాటంగా ఒప్పుకోవడం బాలయ్యకే సాధ్యమైంది. అదేసమయం లో తానునమ్మి పెట్టిన పర్సనల్ సెక్రటరీ.. అవినీతి పాల్పడడం తనకు నచ్చలేదన్నారు. అయితే, తాను గత ఐదేళ్లలో పూర్తి సమయం వెచ్చించి నియోజకవర్గంలో పనులు చేపట్టకపోయానని చెబుతూనే.. గత ఏడాది ఎన్నికలకు తాను ఎలా కష్టపడిందీ వివరించారు.
తొలిసారి తన సతీమణి వసుంధరను రంగంలోకి తెచ్చి ప్రచారం చేయడాన్ని తాను మరిచిపోలేనన్నారు. ఇక, ఇప్పుడు ఐదేళ్లలో ఒక ఏడాది గడిచిపోయిందని, రాబోయే నాలుగేళ్లలో తాను అనేక లక్ష్యాలు పెట్టుకున్నానని బాలయ్య వివరించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హిందూపురం ఆసుపత్రిలో కరోనా బాధితుల కోసం వెంటిలేటర్లు, పీపీయి కిట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆ పనులన్నీ తానే చూసుకుంటున్నానని వివరించారు. ఒకప్పుడు అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్య వస్తే అనంతపురం, బెంగుళూరు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు మంచి స్టాఫ్‌తో హిందూపురం ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశామని వివరించారు.
అలాగే పారిశ్రామికంగా కూడా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు మంచి ఉద్యోగాలు కల్పించాలని తపన ఉందని బాలయ్య వివరించారు. అయితే, తపన ఉంటే సరిపోతుందా? పనిచేయాలిగా అంటున్నారు ఇక్కడి ప్రజలు. మరి బాలయ్య ఈ నాలుగేళ్లలో అయినా సరైన దృష్టి పెడతారో.. లేదా తర్వాత నిరుత్సాహం ప్రదర్శిస్తారో చూడాలి.