అధికారంలో ఉన్న నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో.. ఎంత సీరియస్గా ఉండాలో అనేక సందర్భాలు చెబుతూనే ఉన్నాయి. అయితే, వీటిని పట్టించుకోకుండా.. ఎటు గాలి మళ్లితే అటు ప్రయాణాలు చేస్తే.. ఏం జరుగుతుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. అయితే, ఈ ఏడాది కాలంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయంగా ఎంత దూకుడు ప్రదర్శించినా ప్రయోజనం కనిపించలేదు. నిజానికి జగన్ ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలపై ప్రతిపక్షం ఎదురు దాడి చేసింది. అనేక నిరసనలు వ్యక్తం చేసింది.
అనేక మందితో తెరవెనుక ఉండి.. న్యాయ పోరాటం చేసేలా ప్రయత్నించింది. అయినా కూడా టీడీపీ ఎక్కడా పుంజుకోలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో అంతర్గత రచ్చకు టీడీపీ పరోక్షంగా ప్రయత్నించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా పార్టీలో నేతల మధ్య అసంతృప్తి వ్యక్తమవుతోంది. నేతలు ప్రభుత్వంపై పరోక్షంగా మాటల యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, దీంతో తాము ముందుకు సాగలేక పోతున్నామని వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ.. పార్టీ అధినేత, సీఎం జగన్‌ను ఇరుకున పెడుతున్నారు.
అయితే, మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై తీవ్రంగా విరుచుకుపడాలని ఆయన శ్రేణులకు సూచించారు. అదేసమయంలో స్థానిక నేతలపైనా తీవ్ర విమర్శలు చేయాలని కూడా సిగ్నల్స్ ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు.. ఈ నెల ఒకటి, రెండు తారీకుల్లో తీవ్ర విమర్శలు చేశారు.
ఈ పరిణామాలతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారని అంటున్నారు పరిశీలకులు. ఇది వైసీపీని నిజంగానే ఇరుకున పెట్టిన పరిణామమని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా టీడీపీ వ్యూహం సక్సెస్ అయినట్టేనని అంటున్నారు.