హైదరాబాద్​లో బీజేపీ కీలక సమావేశాలు

-

హైదరాబాద్​లో బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. రెండో రోజుల చొప్పున విస్తారక్​లకు శిక్షణ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. భాగ్యనగరంతో పాటు బిహార్ రాజధాని పట్నాలోనూ ఈ భేటీలు జరగనున్నాయి. పట్నాలో ఈ నెల 21, 22 తేదీల్లో.. హైదరాబాద్‌లో 28, 29 తేదీల్లో సంబంధిత సమావేశాలు జరిగే అవకాశముంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కష్టమైన లోక్‌సభ స్థానాల సంఖ్యను కమలనాథులు 160కి పెంచుకున్నారు. ఇప్పటివరకు వాటి సంఖ్య 144గా ఉండేది. కొత్తగా ఆ జాబితాలో చేరిన సీట్లలో అత్యధికం బిహార్‌కు చెందినవే. జేడీయూతో తెగదెంపుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుండటమే అందుకు కారణం.

 

ఈ జాబితాలోని నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమితులైన కమలదళం వ్యవస్థాగత నేతలు (విస్తారక్‌లు) పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో దిల్లీలో సోమవారం సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై వారంతా చర్చించారు. బిహార్‌లో జరిగే సమావేశంలో 90 సీట్లపై, హైదరాబాద్‌ సదస్సులో మిగిలిన 70 స్థానాలపై బీజేపీ నేతలు సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ సహా వినోద్‌ తావ్డే, సునీల్‌ బన్సల్‌ వంటి కీలక నేతలు వాటికి హాజరయ్యే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news