హైదరాబాద్ః తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలవర్షం కురిపించుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో కొనసాగుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనకుంటా !.. ఇలాంటి నేపథ్యంలో బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను పల్లకిలో మోస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకో తెలుసా?
ఆదివారం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కమళం పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా దాదాపు రాష్ట్ర బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించామని టీఆర్ఎస్ సర్కారు అసత్య ప్రచారం చేస్తోందనీ, ఉద్యోగాల కల్పనపై గులాబి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్‌ను పల్లకిలో మోస్తానని అన్నారు.
ధనిక రాష్ట్రమైన తెలంగాణను నేడు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఎద్దెవా చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర అధికార నేత కుటుంబం అక్రమాలకు పాల్పడుతూ.. ప్రజా సంపదను దోచుకుంటున్నదని ఆరోపించారు. కబ్జాదారులకు ప్రభుత్వం అండగా ఉంటూ వారిని కాపాడుతున్నదని పేర్కొన్నారు.
అలాగే, కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నదని తెలిపారు. అగ్రవర్ణాలకు కూడా ఈడబ్ల్యూఎస్ కార్యక్రమాన్ని అమలు చేయాలనీ, రామ మందిర నిర్మాణంపై టీఆర్ఎస్ తన అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కరోనా గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమనీ, వైరస్‌ను చులకనగా చూడటం వల్లే మహమ్మారి విజృంభణ కొనసాగిందని ఆరోపించారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని బండి సంజయ్ తెలిపారు.